BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 3:56 pm Posted by : Raghunath Rolla

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు టోల్‌గేట్‌తో పాటు జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు మరియు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవే పెట్రోలింగ్ బృందాలు నిరంతరంగా గస్తీ నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువసేపు వాహనాలు నడిపే లారీ, బస్సు మరియు ఇతర వాహనాల డ్రైవర్లకు అలసట కారణంగా ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లను కొద్దిసేపు ఆపి విశ్రాంతి తీసుకునేలా చేయడంతో పాటు, నీటితో ముఖం కడుక్కొని అప్రమత్తంగా ప్రయాణాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు. అలసటగా అనిపించినప్పుడు రోడ్డు పక్కన కాకుండా, గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలు లేదా సురక్షిత విశ్రాంతి కేంద్రాల్లోనే వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు సూచించారు. రహదారి మార్జిన్‌లో వాహనాలు నిలిపివేయడం ఇతర వాహనదారులకు ప్రమాదకరమని హెచ్చరించారు. అదేవిధంగా అతివేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భద్రతే మా లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలియజేశారు.