BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:02 am Posted by : Raghunath Rolla

అణగారిన వర్గాల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

చిలకలూరిపేట, 31 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో, మృతుల కుటుంబాలకు ఎక్స్.గ్రేషియా ప్రకటించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఈమేరకు మందకృష్ణ మాదిగ సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్.గ్రేషియా ప్రకటించడం శుభపరిణామం అని చెప్పారు. కొంత ఆలస్యం అయినప్పటికీ ఎట్టకేలకు ఆర్ధిక సహాయం ప్రకటించారని తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న 27వ తేదీన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రకటన మాత్రమే వచ్చిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. వర్గీకరణ అంశానికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు కనుకనే కూటమి గెలుపు కోసం గత ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కృషి చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. కానీ చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఎక్స్.గ్రేషియా ప్రకటించే విషయంలో ఆలస్యం అయిందని తెలిపారు. చేయూత అందించే విషయంలో తేడా కనిపించిందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా సరిగా స్పందించలేదని అన్నారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో ఆసుపత్రి నిండిపోతే కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. చనిపోయిన వారు ఏ పార్టీకి చెందిన వారు అంటూ ఆరా తీయడం దారుణమని ధ్వజమెత్తారు. దళిత బాధితులు పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రమాదం జరిగిన వెంటనే ఆదుకోవాలని కోరారు.