BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:27 pm Posted by : Raghunath Rolla

నాయకత్వానికి కొత్త దిశ చూపిన టీడీపీ ‘కాన్‌క్లేవ్’

ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన “టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాన్‌క్లేవ్” నాయకత్వానికి కొత్త దిశ చూపించిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడం వంటి అంశాల్లో ఈ కాన్‌క్లేవ్ ఎంతో దోహదపడిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు, మహిళా సాధికారత, ప్రజా గ్రీవెన్స్ నిర్వహణ, ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమాల అనుభవాలను ఇతర నాయకులతో పంచుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వమే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, యువత మరియు మహిళలను రాజకీయాల్లో మరింత భాగస్వాములను చేయడం, సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై జరిగిన చర్చలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని గళ్ళా మాధవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న విజన్, నారా లోకేష్ అందిస్తున్న ఆధునిక నాయకత్వ మార్గదర్శకత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కాన్‌క్లేవ్‌లో పిలుపునిచ్చారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలియజేశారు.