BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 2:56 am Posted by : Raghunath Rolla

బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వట్టిచెరుకూరు తహసిల్దార్ కె. రాజీవ్ కుమార్ తెలిపారు. మంగళవారం “చౌక బియ్యం పక్కదారి” శీర్షికన ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల నుండి వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు బియ్యాన్ని లారీలలో ఎగుమతి చేస్తున్నారని పేర్కొంటూ ఒక దిన పత్రికలో ప్రచురితమైన వార్తపై తహసిల్దార్ స్పందిస్తూ ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో ప్రతి నెలా రాత్రి పగలు గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని, క్రిమినల్ కేసులతో పాటుగా నిత్యావసర సరుకుల చట్టం, 1955 ప్రకారం 6ఏ కేసులను నమోదు చేస్తున్నామని వివరించారు. గత రెండు సంవత్సరాల కాలంలో 3 సార్లు మిల్లులపై, 2 రేషన్ షాపులపై, 6 వాహనాలపై, 5 అనధికారిక స్థలాలలో దాడులు నిర్వహించి 16 కేసులను నమోదు చేసి, 558.11 క్వింటాళ్ళ బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో మొత్తం రేషన్ షాపులలో 1/3 భాగం అనగా 42 దుకాణాలను ఇన్స్పెక్షన్ యాప్ ద్వారా ప్రతి నెలా తనిఖీ చేయుట జరుగుతోందని వివరించారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోన గల శ్రీవల్లి రైస్ మిల్లుపై తనిఖీ నిర్వహించగా ఎటువంటి పి.డి.ఎస్ బియ్యం నిల్వలు గుర్తించుట జరుగలేదని స్పష్టం చేశారు. ప్రతి నెలా పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టుటకు తగు చర్యలు తీసుకొనుట జరుగుతోందని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టుటకు ఎప్పటికప్పుడు సకాలంలో గస్తీ, తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమాలు గుర్తించినప్పుడు నిబంధనల మేరకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు.