BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:27 am Posted by : Raghunath Rolla

ఇష్టానుసారంగా గోడలపై పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు

నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో రహదారుల డివైడర్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ కొత్తపేట, బస్టాండ్ రోడ్, నందివెలుగు రోడ్, షాప్ ఎంప్లాయీస్ కాలనీ, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రింటర్స్, వివిధ మత సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఇష్టానుసారం పోస్టర్లు అంటించవద్దని తెలియచేసినప్పటికీ, కొందరు మరలా అంటిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ అపరాధ రుసుం విధించడంతో పాటు, పట్టణాన్ని “పోస్టర్ ఫ్రీ సిటీ”గా ఉంచేందుకు పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెంట్రల్ డివైడర్లలో ఎటువంటి ఫ్లెక్సీలు ఉండటానికి వీల్లేదని, ప్లానింగ్ కార్యదర్శులు వీటిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలనలో భాగంగా వర్కర్స్ హాజరు వంద శాతం పక్కాగా ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) ద్వారానే ఉండాలని, డ్రైన్లను నిరంతరం శుభ్రం చేస్తూ నగరంలో ఎక్కడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై సెకండరీ కలెక్షన్ పాయింట్లు ఉండకూడదని, వాటిని వెంటనే అక్కడి నుండి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. కొత్తపేట సంతోష్ హోండా రోడ్డు పరిశీలన సందర్భంగా రోడ్డుపైనే నిర్మాణ సామాగ్రి నిల్వ ఉంచడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేసి, అనేక మార్లు హెచ్చరించినప్పటికీ రోడ్లపై మెటీరియల్ పెట్టి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్ననిర్మాణదారులకు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇవ్వాలని, ఈ విషయంలో అలసత్వం వహించిన పట్టణ ప్రణాళిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పరిధిలోని రోడ్లపై ఉన్న పాట్ హోల్స్ గుంతలను తక్షణమే రిపేర్ చేయాలని, చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలో తాగునీటి సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తీసి, వాటర్ క్వాలిటీ డేటాను సిఏంఏం యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ చైతన్య, ఎస్ఎస్ సాంబయ్య, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.