పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలి : వడ్రాణం హరిబాబు
గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిడిసిఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు గుంటూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. చల్లావారిపాలెం, నల్లపాడు, ఏటుకూరు, రాజావారితోట, విసిదల, అడపబజార్ ప్రాంతాల్లోని మండపాలను సందర్శించి మట్టి గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని సూచించారు. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మన సంప్రదాయాలను పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. యువత, ప్రజలు మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ పోతురాజు సమత, సూరిశెట్టి హరీష్, ఉప్పు వెంకట రత్నయ్య, చలవాది రాంబాబు, సూడా పిచ్చయ్య తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.