BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:13 am Posted by : Raghunath Rolla

రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళలు క్రియాశీలక రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో మహిళల నుండి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు విద్య, ఉపాధి, వ్యాపారం, సేవా రంగాలతో పాటు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. అదే విధంగా రాజకీయాల్లోనూ మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజా సమస్యలపై మరింత అవగాహన పెంపొందించుకుని, సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. మహిళల ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం రాజకీయ వ్యవస్థకు ఎంతో అవసరమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మహిళలు ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా మహిళలు సమర్పించిన పలు అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.