BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 11:30 pm Posted by : Raghunath Rolla

వార్డుల పునర్విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన (జి.ఓ.ఎం.ఎస్. నెం.65, ఎం.ఎ.&యు.డి., తేదీ 24-03-2026) మేరకు గుంటూరు నగరంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా 76 ప్రతిపాదిత వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను ఫారం-Iలో సెప్టెంబర్ 5 నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ వివరాలను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాలు మరియు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వార్డుల పునర్విభజన, ముసాయిదా సరిహద్దులకు సంబంధించి ప్రజలకు ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే, సెప్టెంబర్ 11 లోపు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో సమర్పించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 12 సిడిఎంఏకి పంపుతామని, సిడిఎంఏ 13వ తేదీన తుది వార్డ్ లను ఖరారు చేసి, 14వ తేదీన ఏపి గెజిట్ ఫారం- VI లో తుది నోటిఫికేషన్ ప్రచురిస్తారని తెలిపారు.