మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు
అమరావతి, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి రాజధాని ప్రాంతంలో పిడపర్తి టైటస్ బాబు అనే వ్యక్తి కుటుంబం చేతిలో మోసపోయిన భూ బాధితులకు ప్రభుత్వం తక్షణమే పూర్తి న్యాయం చేయాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడారు. ఒక సాధారణ ఎస్.టి.డి. బూత్ నిర్వాహకుడి స్థాయి నుంచి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన పిడపర్తి టైటస్ బాబు కుటుంబం, అమరావతి పరిధిలో సాగించిన భూ కుంభకోణం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి 2015లోనే నాటి రిజిస్ట్రార్ సహకారంతో ఒక మాజీ మంత్రి భార్యతో సహా ఎంతో మంది వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఆ సొమ్ముతో తమ బంధువుల పేరిట 30 ఎకరాలు కొనుగోలు చేసి, బాధితులకు మాత్రం నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చి మోసగించారని మండిపడ్డారు.
ఈ కుంభకోణంలో ప్రధాన బాధితులు నష్టపోయిన మొత్తం సొమ్ము వివరాలను కిషోర్ బాబు వెల్లడించారు. బాధితుల్లో వల్లూరి శివ, దుర్గారావు మాస్టర్లు కోటి పది లక్షల రూపాయలు, కట్టెపోగు సంసోను 75 లక్షల రూపాయలు, నగల వ్యాపారి రామకృష్ణ 50 లక్షల రూపాయలు, కట్టెపోగు సుబ్బారావు 45 లక్షల రూపాయలు నష్టపోగా, వ్యాపారి కిరణ్, రైల్వే గేటు జోగారావు, రాధాకృష్ణ తదితరులు కూడా భారీగా మోసపోయారని వివరించారు. కేవలం ఈ ఐదుగురు ప్రధాన బాధితుల దగ్గరే దాదాపు 2 కోట్ల 80 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారని, మిగిలిన బాధితుల వివరాలు కూడా కలిపితే ఈ మోసం విలువ మరిన్ని కోట్లకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై 2021లో CID కేసు (క్రైమ్ నెం. 05/21) నమోదైనప్పటికీ, బాధితులకు నేటికీ పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టైటస్ బాబు మరణించిన తర్వాత కూడా ఆయన కుటుంబసభ్యులు మంగళగిరి పరిధిలోని 20 ఎకరాల అసైన్డ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రెవిన్యూ, CRDA అధికారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులు తమ డబ్బులు తిరిగి అడిగితే, ఒక పోలీస్ కానిస్టేబుల్ అండతో రౌడీలను పురమాయించి చంపుతామని బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అక్రమాలకు పాల్పడుతూ, కేసులు నడుస్తున్నా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్న ఈ కుటుంబంపై చట్టం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల సొమ్మును రికవరీ చేసి వారికి అప్పగించేలా ఉన్నతాధికారులు విచారణను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.