గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుచలన చిత్రరంగంలో అభిమానుల గుండెలను దోచుకున్న నటుడిగా, ఆలోచనల్లో కదిలే తత్వవేత్తగా, ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవితం ఆదర్శప్రాయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పాత గుంటూరు రామ్మూర్తి వృద్ధాశ్రమంలో, ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద ఇస్రాయిల్ పేట మెయిన్ రోడ్డులో, పాత గుంటూరు కాపు కల్యాణ మండపంలో, నెహ్రూనగర్ 6వ లైన్ లో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే గొంతుక అని తెలిపారు.

తుపానులా దూసుకొచ్చే వ్యక్తిత్వం వెనుక ఎంతో నిశ్శబ్దమైన తపన ఉందని చెప్పారు. ఆయన వెండితెరపై ప్రదర్శించిన ఉద్వేగాలు లక్షలాది గుండెల్లో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాయని చెప్పారు. నాయకత్వం అంటే నిరంతర బాధ్యత అని చాటుతూ ముందుకు సాగుతున్న ఆయన అడుగుల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఓటములు ఎదురైనా అధైర్యపడకుండా, సిద్ధాంతాలకే కట్టుబడి నిలబడిన ఆయన ధైర్యం, నిబద్ధత ఈ రోజు ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టాయని తెలిపారు. రైతుల సమస్యలు, యువత ఉపాధి, మహిళల రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ పడ్డ తపన, చూపిన చొరవ అభినందనీయమన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ప్రస్తానం ఉన్నతమని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ వేసిన అడుగులు ఎంతో కీలకమని తెలియజేశారు.