మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్త సేకరణ పేరుతో జరుగుతున్న అక్రమాలు, సీఎస్ఆర్ నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘనలపై కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో చెత్త సేకరణ పేరుతో ఏ విధంగా నిధుల దోపిడీ జరుగుతుందో బహిరంగ చర్చ ద్వారా ఆధారాలతో సహా బయటపెట్టడానికి సిద్దమని కాకాణి తెలిపారు. రూ.1190 కోట్ల స్కామ్ జరిగిందని చెత్త డంపింగ్ యార్డ్ వద్ద కూర్చొని మాట్లాడించడం కాకుండా, అక్రమాలు జరగలేదని చెప్పే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావలసిందిగా నారాయణకు సవాల్ విసిరారు, మీరు చర్చకు రాకుండా మమ్మలను పనిపాట లేని వారు అని వ్యాఖ్యానించడం ద్వారా సమాధానం చెప్పలేక వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకు డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ కనెక్షన్లు నిలిపివేసి బలవంతంగా వసూలు చేసిన పన్నులుతో పాల్పడిన దోపిడీని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. తమ ఆరోపణలు తప్పయితే ప్రజలు తమను తప్పుపడతారని నిజమైతే నారాయణ వ్యవహారం ప్రజలకే స్పష్టమవుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు ప్రభుత్వ నిధుల మాదిరిగానే పారదర్శకంగా వినియోగించాల్సి ఉంటుందని కాకాణి అన్నారు. కంపెనీలు తమ నికర లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సంబంధిత కంపెనీలు ఏ పనులకు లేదా ఏ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలో లేఖ ద్వారా తెలియజేయాలని, కలెక్టర్ అనుమతితో ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలు అంచనాలు రూపొందించి, ఎంబుక్ నమోదు, చెక్కుల ద్వారా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీల హౌసింగ్ కోసం సీఎస్ఆర్ నిధులను కలెక్టర్ ఖాతా లో జమచేసి తరువాత పీడీ హౌసింగ్ ఖాతాకు బదిలీ చేసి, పారదర్శకంగా లబ్ధిదారులకు చెక్కుల రూపం లో అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత పాలకులు కలెక్టర్‌తో సంబంధం లేకుండా నిధులను తమ చేతుల్లోకి తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అంచనాలు, ఖర్చులపై ప్రశ్నలు సీఎస్ఆర్ నిధుల కింద రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, అందులో రూ.25 లక్షలు కూడా ఖర్చు చేయడం లేదని కాకాణి ఆరోపించారు. అంచనాలు ఎవరు తయారు చేశారు, ఆమోదం తెలిపిన ఇంజనీరింగ్ అధికారులు ఎవరు అని ప్రశ్నించారు. ఒక చెట్టుకు నాటడానికి రూ.5,000, పెంచడానికి రూ.7,000 అంటూ విచిత్రమైన లెక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేవలం రూ.50 లక్షలు ఖర్చు చేసి రూ.3 కోట్ల పనులు చేసినట్లు తప్పుడు నివేదికలతో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కంపెనీలను భయపెట్టి రూ.100 బిల్లు వేసి రూ.10 మాత్రమే ఖర్చు చేస్తూ మిగిలిన నిధులను దోచు కుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.20 కోట్లు, రూ.25 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకునే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. సీఎస్ఆర్ నిధులు తీసుకురావడం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం మంచిదేనని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కాకాణి స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. గత మూడు నాలుగు నెలలుగా చెట్లు, చెత్త, విఆర్ కాలేజీ అక్రమాలు తదితర అంశాలను పరిశీలించి ఆధారాలతో అక్రమాలను బయటపెట్టామని అన్నారు. చెత్త నిర్వహణలో మొదట రూ.85 లక్షలు, టన్నులు ఆ తర్వాత ముఖ్యమంత్రితో కలిసి రూ.1.6కోట్ల టన్నులకు పెంచుకుంటూ వెళ్లడం హాస్యాస్పదమని విమర్శించారు. వాటాలు ఎక్కడెక్కడ అందుతాయో చూసుకుంటూ చెత్త నిల్వలను పెంచుకుంటూ పోయారని ఆరోపించారు.
నారాయణ, లోకేష్, చంద్రబాబుపై విమర్శలు : నెల్లూరు మున్సిపాలిటీ, నగర అభివృద్ధి అంశాలపై మంత్రి నారాయణ, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు నేరుగా సమాధానం చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీపై అవగాహన లేని కొందరు నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు కలసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “చెత్తలో మాకేం తెలియకుండా నారాయణ అన్ని కొట్టేస్తున్నాడు” అంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందన్నారు. చెత్త దోపిడీలో ఎవరి వాటా ఎంత అనేది స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి రాత్రింబవళ్లు కష్టపడి అక్రమాలు అవినీతికి సంబంధించిన దస్త్రాలు, సమగ్ర ఆధారాలను సేకరించారని కాకాణి తెలిపారు. మంత్రి నారాయణ చర్చకు రాకపోయినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, నారాయణ దోపిడీకి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. సీఎస్ఆర్ నిధులు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ప్రెజెంట్ వేస్ట్ నిర్వహణ వరకు జరిగిన ప్రతి అక్రమాన్ని “యండమూరి వీరేంద్రనాథ్ సీరియల్” తరహాలో వరుసగా ఎండగడతామని పేర్కొన్నారు. పేదల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సీఎస్ఆర్ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని, నిధుల కేటాయింపులు, ఖర్చులపై స్పష్టత ఇవ్వాలని కాకాణి డిమాండ్ చేశారు. సీఎస్ఆర్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన కంపెనీలు, బాధ్యులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ లో చేసిన చట్టం ప్రకారం సీఎస్ఆర్ నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఉన్నాయని, ఎమ్మెల్యే, ఎంపీ నిధుల మాదిరిగానే కలెక్టర్ల ద్వారా పారదర్శకంగా పనులు మంజూరు చేయాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.