గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనచైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు పొందారు. నవభారత్‌నగర్, నాయుడుపేట, పొట్టి శ్రీరాములునగర్, శ్రీనగర్, అమరావతి రోడ్డు, గుజ్జనగుండ్ల, ఎస్వీఎం కాలనీ తదితర ప్రాంతాల్లో మాదల చైతన్య పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ, వినాయక చవితి భక్తి, ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అన్నారు. గణనాథుడి కృపతో గుంటూరు నగర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన సూచించారు. వినాయక మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల కమిటీ నిర్వాహకులు, సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.