పల్నాడు జిల్లా (నరసరావుపేట), 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట నియోజకవర్గంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)లో నూతనంగా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం, మరికొన్ని నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు ముఖ్యఅతిథి నారా లోకేష్ చేతు మీదగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాజ్యసభ సభ్యులు బాష్యం రామకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి, పెదకూరపాడు శాసనసభ్యులు బాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, JNTUK వైస్ ఛాన్స్లర్ సి ఎస్ ఆర్ కె ప్రసాద్, యూనివర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా జేఎన్‌టీయూలో చేపడుతున్న నూతన భవనాల నిర్మాణం నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని అన్నారు. ముందుగా పల్నాడు జిల్లా నరసరావుపేటకు తొలిసారిగా విచ్చేసిన నారా లోకేష్ కి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.