BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:49 am Posted by : Raghunath Rolla

పెందుర్తి లో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

భక్తులను అలరించిన భరతనాట్య ప్రదర్శన..

ఘనంగా హోమం, తీర్థప్రసాద వితరణ

విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోని లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భరతనాట్య సాంస్కృతిక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల అద్భుత నృత్య ప్రదర్శన, అభినయం భక్తుల్లో భక్తిభావాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ప్రసాదంగా టిఫిన్‌ (ఫలహారం)ను భక్తులకు అందజేశారు. భక్తులు క్రమశిక్షణతో ప్రసాదాన్ని స్వీకరించారు. కాలనీ ప్రెసిడెంట్ సరగడం రాము ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ కమిటీ సభ్యులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కాలనీ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు. అలాగే సోమవారం నిర్వహించిన హోమ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.