BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 8:11 am Posted by : Raghunath Rolla

పెదకాకాని మండలంలో వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన డిఇఓ

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష పెదకాకాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబూరు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నంబూరు, మండల ప్రాథమిక పాఠశాల నంబూరు లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్ ఏ వన్ పరీక్షల లొ వచ్చిన మార్కుల తీరును, చూచిరాత పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటుచేశారు. పాఠశాల తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు పాఠశాలలు హాజరుకాని విద్యార్థుల వివరాలను తెలియజేయాలన్నారు. పాఠశాలలో డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు వారి తరగతులకు తగ్గ సామర్థ్యాలు కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకం ఏర్పడే విధంగా ఉపాధ్యాయులందరు కృషి చేయాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం విద్యార్థులందరూ భుజించేవిధంగా తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావాలన్నారు. భోజన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.