గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. తిరుపతిలో ఆగస్టు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు సాధించారు. బాస్కెట్‌బాల్ అండర్ – 23 పురుషులు, వాలీబాల్ అండర్ – 23 మహిళల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి విజేతలుగా నిలిచారు. వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ అభినందిస్తూ మరిన్ని పతాకాలు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచాలన్నారు. క్రీడలలో గుంటూరు జిల్లా అగ్రగామి కావాలని ఆకాక్షించారు.

భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ కు ఉత్తమ క్రీడాభివృద్ధి అధికారి అవార్డు లభించడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.