BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 11:31 am Posted by : Raghunath Rolla

భారత్‌ దాయాదిపై మరోసారి పంజా !

55 రన్స్‌కే కుప్పకూలిన దాయాది

టీ20ల్లో ఆ జట్టుకు అత్యల్ప స్కోరు

దెబ్బకొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి, ప్రేమ

7 వికెట్లతో టీమిండియా విక్టరీ

స్పొర్ట్స్ డెస్క్ , భారత్ ప్రతినిధి న్యూస్ : క్రికెట్‌ మైదానంలో పాకిస్థాన్‌ను చూడగానే చెలరేగిపోయే భారత్‌ మరోసారి దాయాదిపై పంజా విసిరింది. మహిళల ఆసియా కప్‌లో ఖతర్నాక్‌ బౌలింగ్‌తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. తెలుగమ్మాయి శ్రీచరణి (3/7)తో పాటు ప్రేమ రావత్‌ (3/9) దీప్తి శర్మ 2/5) స్పిన్‌ దెబ్బకు విలవిలలాడిన పాక్‌ టీ20ల్లో తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి చిత్తయింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన గ్రూప్‌-ఏ పోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. వరుసగా మూడో విక్టరీతో సెమీఫైనల్‌కు సిద్ధమైంది. భారత స్పిన్నర్ల దెబ్బకు పాక్‌ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు షవాల్‌ జుల్ఫికర్‌ (14), మునీబా అలీ (13) టాప్‌ స్కోరర్లు. ఆ జట్టులో తొమ్మిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అనంతరం చిన్న లక్ష్యాన్ని భారత్‌ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (18 నాటౌట్‌) రాణించింది. శ్రీచరణికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ క్రికెటర్లతో భారత్‌ కరచాలనం చేయలేదు.
52 బంతుల్లోనే… చిన్న టార్గెట్‌ ఛేజింగ్‌లో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయినా 52 బంతుల్లోనే విజయం అందుకుంది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టిన ఓపెనర్‌ షెఫాలీ వర్మ (12) రెండో ఓవర్లో ఫాతిమా సనాకు బౌండరీతో స్వాగతం పలికింది. కానీ తర్వాతి బంతికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ప్రతీక (4)మరోసారి నిరాశ పరిచింది. అదే ఓవర్లో మునీబాకు క్యాచ్‌ ఇచ్చింది. రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (9)ను నాలుగో ఓవర్లో ఎల్బీ చేసిన సనా భారత్‌ను 29/3తో నిలిపింది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ ఇవ్వకుండా పాక్‌ బౌలర్లు టీమిండియా విజయాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. కానీ, నష్రా బౌలింగ్‌లో దీప్తి (12 నాటౌట్‌) ఫోర్‌ కొట్టగా.. ఆమె తర్వాతి ఓవర్లోనే వరుసగా 4, 6 బాదిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మ్యాచ్‌ను ముగిచింది.