ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవలు, సంగీత ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తిదాయకం : ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

నందిగామ, 26 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ నందు కీర్తిశేషులు, స్వర్గీయ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన “మధుర స్వరాంజలి” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలు గొప్పతనాన్ని, ఆయన అందించిన అద్భుతమైన సంగీత సేవలను ఎమ్మెల్యే సౌమ్య గుర్తు చేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం స్వరం భారతీయ సంగీత ప్రపంచానికి ఒక అపూర్వమైన వరమని, భాష, ప్రాంతం అనే హద్దులు లేకుండా కోట్లాది మంది హృదయాలను తన మధుర గానంతో గెలుచుకున్న మహోన్నత కళాకారుడని ఆమె పేర్కొన్నారు. తెలుగు సినీ సంగీతానికి మాత్రమే కాకుండా వివిధ భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. బాలు గారి గాత్రం తరతరాలుగా సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటుందని, ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని తంగిరాల సౌమ్య అన్నారు. శరీరంగా మన మధ్య లేకపోయినా తన గానంతో ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన మధుర స్వరాంజలి కార్యక్రమంలో గాయకులు ఆలపించిన బాలు పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కళాకారులు తదితరులు పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి ఘన నివాళులు అర్పించారు.