గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (పిజిఆర్ఎస్) ద్వారా అందే ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీ స్థాయి అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారుల ద్వారా మొత్తం 168 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, ఒక్కో వినతిని పరిశీలించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుని అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే పిటిషన్‌ను ముగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి, సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు, ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పిజిఆర్ఎస్ సీఐ బిలాలుద్దీన్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.