BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:23 pm Posted by : Yaddanapudi Arudra

త్వరలో అర్హులందరికీ పింఛన్లు : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. శుక్రవారం స్థానిక తూర్పు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉంటామని తెలిపారు. ఎక్కువగా పింఛన్లు, ఇంటి స్థలాలు, శానిటేషన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చాయని, సంబంధిత అధికారులకు అర్జీలను పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, పింఛన్ల కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే అర్హులైన వారిని గుర్తించామని, ప్రతి ఒక్కరూ సచివాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని చెప్పారు. కూటమి నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, కలిసికట్టుగా అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బలం చేకూర్చడం ద్వారా గుంటూరు నగరంలో మరింత అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సుమారు రూ.350 కోట్లు వెచ్చించామన్నారు. మురుగు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లను సైతం సీసీలుగా తీర్చిదిద్దుతున్నామని, గత వైసీపీలో గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కేవలం రోడ్లనే కాకుండా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.

కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ : కృష్ణుడి జీవితం ప్రతి మానవుడికి మార్గదర్శకమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా స్థానిక పాత గుంటూరులోని యాదవబజార్, మణి హోటల్ సెంటర్, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొనే ధైర్యం కృష్ణుడి బాల్యం నేర్పుతుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన భగవద్గీత సమాజానికి సన్మార్గం చూపించదని తెలియజేశారు.