గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 25వ వార్షిక మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పూర్ణకుంభ స్వాగతం అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతో కలిసి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ ఆధ్వర్యంలో ఐదుగురు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల శ్రేయస్సు, జిల్లా ప్రజల శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మహోత్సవం సందర్భంగా సుమారు 1,200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ శంకరయ్య, ఏఆర్‌ఆర్‌ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.