BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 1:14 pm Posted by : BHARATH PRATHINIDHI

డీఎస్సీ పై వైసీపీ దుష్ప్రచారం దారుణం

ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు..

ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

డీఎస్సీ ఫలితాలు విడుదలైన వెంటనే తెనాలి మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఉత్తమ ఫలితాలు సాధించారని వైసీపీ నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభినందనలు తెలిపారని గుర్తుచేశారు. అప్పుడు డీఎస్సీ ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అదే డీఎస్సీని బోగస్‌ గా చిత్రీకరించడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో మోసం జరిగిందని, డీఎస్సీ నిర్వహణ విషయంలో కాలయాపన తప్ప మరోటి చేయలేదని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో మెగా డీఎస్సీ ని పారదర్శకంగా నిర్వహించి వేలాది మంది యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. విద్యారంగ సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని గళ్ళా మాధవి కొనియాడారు. నిరుద్యోగ యువత ఆశలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని అన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎంపికైతే గొప్పలు చెప్పుకుని, ఇప్పుడు అదే డీఎస్సీని బోగస్‌గా విమర్శించడం వైసీపీ నాయకుల రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట అని విమర్శించారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానుకుని, అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని వైసీపీ నేతలకు హితవు పలికారు.