‘పరిగ్రీన్’ ఏజెన్సీతో కలిసి ఘోర మోసం..
3 నెలలుగా వేతనాలు ఎగ్గొట్టిన వైనం
నోరు విప్పితే బెదిరింపులు..
గుంటూరు లేబర్ అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరి !
గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కోట్లు గడిస్తూ, ఐదు నక్షత్రాల హోదాను ప్రదర్శించే ఐటీసీ వెల్‌కమ్ హోటల్ యాజమాన్యం నిజస్వరూపం బయటపడింది. రాత్రింబవళ్లు కష్టపడి భద్రత కల్పించిన 19 మంది పేద సెక్యూరిటీ గార్డుల కడుపు కొడుతూ దారుణ దోపిడీకి పాల్పడుతోంది. గత 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా, అడిగితే దాటవేస్తూ కార్మికులను రోడ్డున పడేసింది. ఈ కార్పొరేట్ దగాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీకి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
కుమ్మక్కై దగా.. అగ్రిమెంట్ పేరిట డ్రామా!
విద్యానగర్ 4వ లైన్లోని ఐటీసీ వెల్‌కమ్ హోటల్‌లో ‘పరిగ్రీన్’ ఏజెన్సీ ద్వారా చేరిన కార్మికులను యాజమాన్యం తీవ్రంగా వేధిస్తోంది. లావాదేవీలు చెల్లించలేదని హోటల్ సాకు చూపిస్తే, ఒప్పందం రద్దయిందని ఏజెన్సీ చేతులెత్తేసింది. జీతాలు హోటల్ వారే ఇస్తారని ఏజెన్సీ చెప్పడం, ఆ తర్వాత హోటల్ యాజమాన్యం మాట మార్చి బాధితుల ఫోన్లు కూడా ఎత్తకపోవడం చూస్తుంటే రెండు వర్గాలు ముందస్తు ప్లాన్ ప్రకారమే కార్మికుల సొమ్మును నొక్కేసినట్లు స్పష్టమవుతోంది.
లేబర్ ఆఫీస్ కుమ్మక్కు ఉందా?
కార్మిక చట్టాలను పాతరేస్తున్న ఐటీసీ హోటల్ నిర్వాహకులపై గుంటూరు లేబర్ ఆఫీసర్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు నయా పైసా ఉపయోగం లేని చర్యలతో కాలయాపన చేశారు. లేబర్ అధికారుల అండదండలు, మామూళ్ల దందా వల్లే ఈ హోటల్ యాజమాన్యం ఇంత తెగించి కార్మికుల హక్కులను కాలరాస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న ఐటీసీ వెల్‌కమ్ హోటల్ యాజమాన్యం, పరిగ్రీన్ ఏజెన్సీల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తమ బకాయిలను తక్షణమే ఇప్పించాలని రాకేష్, ప్రసన్న, మనీషా, రుబీనా, కృష్ణ, తిలక్ తదితర బాధితులు జిల్లా ఎస్పీని వేడుకున్నారు.