BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 1:20 pm Posted by : Raghunath Rolla

రాష్ట్రంలో 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం

జలయజ్ఞం పేరుతో గత పాలకుల దోపిడీపై ఎమ్మెల్యే, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ధ్వజం

​కాకినాడ బ్యూరో, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. సోమవారం కాకినాడ లో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పూర్తి చేయాల్సిన గడువులు, గత వైసిపి ప్రభుత్వ అవినీతిపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ​రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను ఎంపిక చేసి, వాటి పూర్తికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారని ఆయన తెలిపారు. ఈ 36 ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 78,135 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 44,614 కోట్లు ఖర్చయ్యాయని, మిగిలిన రూ. 32,199 కోట్ల పనులను పూర్తి చేయడానికి షెడ్యూల్స్ ఖరారు చేశామన్నారు. ఇందులో భాగంగా పోలవరం ప్రధాన ప్రాజెక్టును మార్చి 2027 నాటికి, పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం ఎడమ కాలువను అనకాపల్లి వరకు నేటితో పూర్తి చేసామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సైతం ఆగస్టు 2026 నాటికి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1ను జూలై 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ. 3,000 కోట్లు కేటాయించి జూన్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే విజయవాడను ముంచెత్తిన బుడమేరుకు సంబంధించి మళ్లింపు కాలువ పనులను, కాటన్ బ్యారేజీ గేట్ల పనులను జూన్ 2027 నాటికి పూర్తి చేసి వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించారు. ​రాష్ట్రంలో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కృష్ణా, గోదావరి ఆయకట్టును కాపాడుకోగలిగామంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు వల్లేనని ఆయన ప్రశంసించారు. ఎప్పటి నుంచో రైతులు ఆశగా ఎదురుచూస్తున్న పోలవరం ఎడమ కాలువ (లెఫ్ట్ మెయిన్ కెనాల్) పనులు 87 శాతం పూర్తయ్యాయని, ఈ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి సెప్టెంబర్ 2వ తేదీన అనకాపల్లి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను లాంఛనంగా ప్రారంభించి “జలహారతి” ఇవ్వనున్నారని వెల్లడించారు.
​ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును 1996లోనే రూ. 10,200 కోట్ల అంచనాలతో చంద్రబాబు గారు ప్రారంభిస్తే, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం కేవలం రూ. 981 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు క్రెడిట్ తమదే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జలయజ్ఞం పేరుతో గత పాలకులు సుమారు రూ. 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఈడీ నిర్ధారించిందని ఆయన గుర్తుచేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకున్న జగన్.. ప్రాజెక్టు వద్దే ఉచితంగా దొరికే ఇసుకను తరలించడానికి ‘ఎక్సవేషన్, లీడ్ అండ్ లిఫ్ట్’ అనే పేరుతో అదే కాంట్రాక్టర్లకు ఆ డబ్బంతా తిరిగి దోచిపెట్టారని విమర్శించారు. ​మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాజెక్టు కాలువలు తవ్వింది నిజమేనని, అయితే కేవలం పురుషోత్తపట్నం నుంచి ప్రత్తిపాడు వరకు మెత్తటి మట్టి ఉన్న చోట మాత్రమే తవ్వి ఆ మట్టిని గుట్టలుగా పోసి వందల కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కష్టమైన కొండలు, గుట్టల ప్రాంతాలను కాలువల తవ్వకానికి పనికిరాకుండా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టులకు తిరిగి జీవం పోస్తూ, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ​ఈ పత్రికా సమావేశంలో కాకినాడ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పాల్గొన్నారు.