BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 3:31 pm Posted by : Raghunath Rolla

150 వీధి కుక్కలకు ఏబిసి చేయడానికి పటిష్ట చర్యలు : జి.ఎం.సి కమిషనర్

గుంటూరు, 29 ఆగస్ట్ 29.2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రతి రోజు 150 వీధి కుక్కలకు నిర్దేశిత నిబందనల మేరకు ఏబీసి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం పొన్నూరు రోడ్ లోని ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్) తనిఖీ చేసి, సెంటర్‌లో కుక్కలకు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్రచికిత్సల నిర్వహణ తీరు, ఆపరేషన్ థియేటర్ల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించి, సెంటర్ పనితీరుపై పశువైద్య అధికారులు, నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ల ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కనీసం 150 వీధి కుక్కలకు ఏబీసీ శస్త్రచికిత్సలు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కుక్కలను సురక్షితంగా ఏబీసీ సెంటర్‌కు తీసుకురావడానికి అవసరమైన డాగ్ క్యాచింగ్ బృందాన్ని పరిధిని బట్టి అదనపు వాహనాలను కాంట్రాక్ట్ ఏజెన్సీయే తీసుకోవాలని ఆదేశించారు. శస్త్రచికిత్సల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ అంతా జరగాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత కుక్కలు త్వరగా కోలుకునేందుకు వీలుగా వాటికి సరిపడా సమయం, పోషకాహారం, అవసరమైన యాంటీ-రేబీస్ వ్యాక్సినేషన్, తగిన పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సూచించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే వాటిని అవి పట్టుబడిన ప్రాంతాల్లోనే సురక్షితంగా వదిలిపెట్టాలని తెలిపారు. ఏబీసీ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న అదనపు నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని, సెంటర్ కి కాంపౌండ్ వాల్, మెయిన్ గేటు నిర్మాణం చేయాలని ఎస్ఈని ఆదేశించారు. ఏబీసి సెంటర్ నిర్వహణకు ఎవరైనా జంతు ప్రేమికులు లేదా స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తే వారికి నిర్వహణ భాధ్యతలు కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని విఏఎస్ ని ఆదేశించారు. నగరంలో రోడ్లపై ఆవులు, ఎద్దులు తిరిగితే వాటిని జిఎంసి గోశాలకు తరలించాలని, సదరు యజమానులపై అపరాధ రుసుం కూడా విధించాలని స్పష్టం చేశారు. అనంతరం కెవిపి కాలనీ మెయిన్ రోడ్ లో జిఎంసి నుండి ముందస్తు అనుమతి లేకుండా రోడ్ ని తవ్వి కేబులింగ్ చేసిన ఏజన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు ఏజన్సీకి నోటీసులు జారీ చేయాలని, అలాగే వారితోనే రోడ్ రీ స్టోర్ చేయించాలని డిఈఈ, ఏఈలను ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా కేబుల్ లైనింగ్ కోసం రోడ్ తవ్వాలి అంటే తప్పనిసరిగా జిఎంసి నుండి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఏసిపి జకిరా, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.