పోస్టల్ సూపరింటెండెంట్ యు.యలమందయ్య
గుంటూరు, 12 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్కాతమ్ముడు అన్నాచెల్లెళ్ల బంధానికి రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పౌర్ణమి వేడుకను పురస్కరించుకొని ఉద్యోగం,వ్యాపారం, చదువు నిమిత్తం విదేశాలలో ఉన్న సోదరులు, బంధువులు, ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు మరియు నిబంధనలకు లోబడి అనుమతించబడిన వస్తువులను పంపేందుకు గాను భారత తపాలా శాఖ అంతర్జాతీయ పార్సిల్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 28 న రాఖీ పౌర్ణమి జరుపుకోనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు సమీప బ్రాంచ్ పోస్టాఫీసు ద్వారా కూడా విదేశాలకు రాఖీలు పంపించుటకు 10% రాయితీతో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ సదుపాయాన్ని భారత తపాలా శాఖ అన్ని తపాలాశాఖ కార్యాలయాల్లో రిటైల్ కస్టమర్లకు కల్పించింది. ప్రైవేటు కొరియర్ ఛార్జీల కంటే తక్కువ ధరలోనే సురక్షిత ప్యాకింగ్‌తో తపాలాశాఖ రాఖీలను బట్వాడా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా దూర ప్రాంతాల్లో ఉన్నవారితో సైతం రాఖీ పండుగ సంతోషాన్ని పంచుకోవచ్చని, ఈ సదవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోగలరని గుంటూరు పోస్టల్ సూపరింటెండెంట్ యు. యలమందయ్య తెలియపరిచారు.