BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:14 pm Posted by : BHARATH PRATHINIDHI

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) విచారణ ప్రక్రియ పక్కాగా జరగాలి

కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం పారదర్శకంగా, నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరగాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 139, 176 పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న సర్ విచారణ ప్రక్రియను పరిశీలించి, విచారణకు సంబంధించిన రికార్డులను, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విచారణకు హాజరయ్యే ప్రజలు మరియు దరఖాస్తుదారులు తమతో పాటు నిర్దేశిత గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకువచ్చేలా బిఎల్ఓలు పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. విచారణకు అత్యవసర కారణాలతో హాజరు కాలేని వారికి పరిశీలించి, మరోమారు విచారణ సమయం కేటాయించాలని ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా విచారణ ప్రక్రియను వేగవంతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ బిఎల్ఓలు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏఈఆర్ఓ జి.సాంబశివరావు, సూపర్వైజరీ అధికారి రవి కిరణ్ రెడ్డి, బిఎల్ఓలు పాల్గొన్నారు.