BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 2:16 pm Posted by : BHARATH PRATHINIDHI

దివ్యాంగుని ఇంటి వద్దకే ‘సర్’

* నోటీసులపై స్వయంగా వెళ్లి విచారించిన గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కిరణ్ కుమార్
* సంతోషం వ్యక్తం చేసిన దివ్యాంగుడు
* అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నతహసీల్దార్

గుంటూరు, 19 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చక్రాల కుర్చీకి పరిమితమైన ఓ దివ్యాంగుడి ఓటు హక్కుకు ఆ అధికారి చొరవ ఊపిరి పోసింది. ఓటు హక్కు నిలిపేందుకు ముందుకు కదిలిన గుంటూరు పశ్చిమ తహసీల్దార్, ఏఈఆర్వో కిరణ్ కుమార్ ప్రయత్నానికి ప్రజాస్వామ్యం చిరునవ్వులొలికింది. తహసీల్దార్ చేసిన ప్రయత్నం తోటి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా గత నెల మ్యాపింగ్ పూర్తి చేశారు. అనంతరం అన్ మ్యాపింగ్, 2002 ఓటర్ల జాబితా, ఇప్పటి జాబితాలో మార్పులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా బుధవారం ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ మండలం పరిధిలోని పెదపలకలూరులో ఏఈఆర్వో అండ్ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో హియరింగ్ నిర్వహించారు. హియరింగ్ కు నోటీసులు అందుకున్న ఓటర్లు వచ్చి తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఓటు హక్కు నిలుపుకోవాలి. అయితే ఎస్సీ కాలనీకి చెందిన ఆముదాల బాలస్వామి (50 సంవత్సరాలు) దివ్యాంగుడు కావడంతో హియరింగ్ వద్దకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ రాత్రి ఏడు గంటల సమయంలో స్వయంగా బాలస్వామి నివాసానికి వెళ్లారు. అక్కడే సదరు ఓటరు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి విచారణ చేశారు. బీఎల్వో వెంకటవరప్రసాద్ సహకారంతో విచారణకు అవసరమైన అన్ని సంబంధిత పత్రాలను సేకరించారు. ఓటు హక్కు కల్పిస్తామని బాలస్వామికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆముదాల బాలస్వామి మాట్లాడుతూ తనకు ప్రజాస్వామ్యంపై అత్యంత గౌరవం ఉందని, ఓటు హక్కు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. తన పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన పత్రాలను సేకరించి విచారణ నిర్వహించిన తహసీల్దార్ కు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఏఈఆర్వో కిరణ్ కుమార్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరుకు సముచిత అవకాశం కల్పించడమే లక్ష్యమని, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు.