BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:46 am Posted by : BHARATH PRATHINIDHI

ఓటు హక్కు కోసం అడుక్కోవాలా ? : ప్రకాశ్ రాజ్

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : తన ఓటు హక్కు తొలగింపు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన ఓటుకు సంబంధించి చిరునామా విషయంలో పొరపాటు జరిగిందని ఈసీ సిబ్బంది ముందుగా తనకు క్షమాపణలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాత అడ్రస్‌కు బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)ను పంపి కావాలనే వీడియోలు తీయించి, వాటిని మీడియా మరియు అధికార బీజేపీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయించారంటూ ఒక వీడియో సందేశం ద్వారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకొకసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుక్కుంటారని, కానీ అలాంటి ఓటును వినియోగించుకోవడానికి ఇప్పుడు సామాన్య ప్రజలు క్యూలలో నిలబడి హక్కుల కోసం అడుక్కోవాల్సి రావడం ఎంతవరకు సమంజసమని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును కాలరాసే విధంగా అధికారుల తీరు ఉందంటూ ఆయన మండిపడ్డారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ, వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.