కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న చంద్రబాబు : వైయస్ జగన్ ఫైర్
ఈ ఖరీఫ్‌లో ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల నష్టం
అయినా సీఎం ఏ మాత్రం పట్టించుకోని వైనం : వైయస్ జగన్
తాడేపల్లి, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న సీఎం చంద్రబాబు, కరవును ఎదుర్కోవడానికి కనీసం ప్లాన్ సిద్ధం చేయలేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. జూలై నాటికే కరవు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా, డెల్టాకు నీరిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రచారం వల్ల, నమ్మిన రైతులు సాగుకు దిగారని, ఇప్పుడు తీవ్ర కరవు పరిస్థితులు రావడంతో నారుమళ్లు సైతం ఎండి పోతున్నాయని, అయినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన కార్యాచరణ లేకపోవడం వల్ల, రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల మేర నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, సమస్యను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.
సీమ ప్రాజెక్టుల్లో అడుగంటిన నీరు : తెలుగుగంగ కెనాల్ మీద ఆధారపడి ఉన్న వెలుగోడు, బ్రహ్మసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే, ఇప్పుడు (ఆగస్టు 25న) వాటన్నింటిలో కలిపి 55 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో డెడ్ స్టోరేజ్ దాదాపుగా 14 టీఎంసీల దాకా తీసేస్తే ఇక అందుబాటులో ఉన్న నీరు కేవలం 41 టీఎంసీలు మాత్రమే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి అని జగన్ వెల్లడించారు.