BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:57 pm Posted by : Raghunath Rolla

‘నేత్రదానం’ ఉద్యమంలో పాల్గొనండి.. ‘దృష్టి సందేశ దాత’ అవ్వండి

గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నేత్రదానం ఉద్యమంలో పాల్గొనండి. దృష్టి సందేశ దాత అవ్వండి, అని ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలులో భాగంగా పోస్టర్ లను శనివారం జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేత్రదానం గురించి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ సంక్షేమ సమితిలో అన్నివిధాలా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు చెప్పడం వల్ల ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుందన్నారు. నేత్ర దానం చేయడం ద్వారా మరణించిన అనంతరం కూడా ప్రపంచాన్ని మీ కళ్ళు చూస్తాయని అన్నారు. కళ్ళజోడు పెట్టుకొనేవారు, మధుమేహం, అధిక బ్లడ్ ప్రెషర్, ఉబ్బసం వ్యాధులతో బాధపడేవారు కూడా నేత్రదానం చేయవచ్చన్నారు. కంటి శుక్లాల (కెటరాక్ట్) ఆపరేషన్ చేయించుకొన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చని తెలిపారు. ఒకరు నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి కంటి చూపు లభిస్తుందని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కె. విజయలక్ష్మి మాట్లాడుతూ, మరణించిన 6 గంటల లోపు నేత్రాలను తీయవలసి ఉంటుందన్నారు. సకాలంలో నేత్రదానం జరిగేలా చూడటంలో ముఖ్య భూమిక నిర్వహంచాలన్నారు. మరణించిన వ్యక్తి తన నేత్రాలను దానం చేస్తున్నట్టు ఇదివరకే ప్రతిజ్ఞ చేసినా, చేయకపోయినా సరే, ఆ కుటుంబం వారి అనుమతితో కూడా కళ్ళను తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, అంధత్వ నివారణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.