ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
డాక్టర్ సిహెచ్. రత్నం మోహన్
చిలకలూరిపేట, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ సిహెచ్. రత్నం మోహన్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట మండల పరిధిలోని కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డులు, మందుల లభ్యతపై ఆరా
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ప్రసవ వార్డులను ఆయన పరిశీలించారు. రోగుల హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిస్టర్లను తనిఖీ చేసి, అవసరమైన అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ నవీన్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ నాగేశ్వరరావు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.