గుంటూరు, 29 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరి ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని ఎన్ హెచ్ -16 రోడ్ ఎక్సటెన్షన్ కారిడర్ (ఈ -13 రోడ్ ) నిర్మాణం కోసం కేటాయించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవతో ఈ భూ కేటాయింపులకు మార్గం సుగమయిందని, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎయిమ్స్ మంగళగిరి భూమికి బదులుగా 10 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని జిల్లా యంత్రాంగం ద్వారా త్వరగా అప్పగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిందని డా. పెమ్మసాని తెలిపారు. 10 ఎకరాల భూమి అప్పగింత పూర్తయిన వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెమసాని మాట్లాడుతూ, ఎన్ హెచ్ -16 విస్తరణ కారిడర్ నిర్మాణానికి అవసరమైన భూ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, ఈ నిర్ణయం మంగళగిరి – గుంటూరు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు 183 ఎకరాల భూమిలో ఇంకా పెండింగ్‌లో ఉన్న 6.04 ఎకరాల భూమి డీమార్కేషన్, అప్పగింత ప్రక్రియను కూడా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఎన్ హెచ్-16 విస్తరణ పనులకు అవసరమైన భూ సమస్యలను పరిష్కరించి, మంగళగిరి–గుంటూరు ప్రాంతంలో మెరుగైన రహదారి మౌలిక వసతులు, వేగవంతమైన కనెక్టివిటీ కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.
గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ పరిహారపు 4వ విడత బిల్లులు విడుదల
గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ భూములు ఇచ్చిన రైతులకు భూసేకరణ పరిహారం అందించే ప్రక్రియలో మరో ముందడుగు పడిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భూసేకరణ పరిహారానికి సంబంధించి 51 మంది రైతులకుగానూ 4వ విడత కింద రూ.17.09 కోట్ల విలువైన 5 సి ఎఫ్ ఎం ఎస్ బిల్లులు సిద్ధంగా ఉన్నాయని, ఇవి గరపాడు, ప్రత్తిపాడు, మల్లాయపాలెం, కొండేపాడు, రావిపాడు గ్రామాలకు సంబంధించినవని తెలిపారు. ఇందులో భాగంగా మిగిలిన సుమారు రూ.14 కోట్ల చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు రావాల్సిన పరిహారం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ, పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సహకారంతో చేపడుతున్న గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ ఫేజ్–1ను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, వారికి రావాల్సిన పరిహారం సకాలంలో అందేలా చర్యలు కొనసాగుతాయని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.