BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 7:42 am Posted by : Raghunath Rolla

అనుమానాస్పద హత్య కేసును ఛేదించిన నల్లపాడు పోలీసులు

యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

గుంటూరు, 27 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ డీఎస్పీ జీ. పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 17న తురకపాలెం జనచైతన్య ప్లాట్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మృతుడు పెద్దపలకలూరు గ్రామానికి చెందిన దావులూరి ప్రసన్న (28)గా గుర్తించారు. ఆగస్టు 14 నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ ప్రసన్న తల్లి శాంతమ్మ నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా కూకట్పల్లి నాగేశ్వరరావు, అతని అన్న కూకట్పల్లి వెంకటయ్య కలిసి ప్రసన్నను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రసన్నకు పెద్దపలకూరు గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండగా, అదే మహిళతో నాగేశ్వరరావుకు కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయంపై ప్రసన్నపై కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు తన సోదరుడు వెంకటయ్యతో కలిసి ప్రసన్నను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సౌత్ డీఎస్పీ జీ. పూర్ణచంద్రరావు తెలిపారు.