గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దాదాపు రూ.4,30,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జేకేసీ నగర్‌లో శేషయ్య హాస్పిటల్ వెనుక ప్రాంతంలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం 39వ డివిజన్‌లోని నేతాజీ మున్సిపల్ హైస్కూల్ సమీపంలో సీసీ డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు, కృష్ణబాబు కాలనీ 1వ లైన్‌లో సీసీ డ్రైన్, రోడ్డు పనులకు, నాయీబ్రాహ్మణ కాలనీ 5వ లైన్ మెయిన్ రోడ్డులో సీసీ డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గుజ్జనగుండ్ల, నేతాజీనగర్, నాయీబ్రాహ్మణ కాలనీ, జేకేసీ రోడ్ ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న అనేక సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతంలో టెండర్లు పూర్తయినప్పటికీ, కొన్ని కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడం, కొందరు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లడం వంటి కారణాలతో అభివృద్ధి పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అత్యంత అవసరమైన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
జేకేసీ కాలేజీ రోడ్డులో ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉందని స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. డీమార్ట్ సమీపంలో రహదారి మూసివేయబడిన నేపథ్యంలో భారీ లోడ్లు మోసే లారీలు, టిప్పర్లు అంతర్గత రోడ్లలో సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యపై సీఐ, ట్రాఫిక్ సీఐ, డీఎస్పీతో సమావేశమై సమగ్ర సమీక్ష నిర్వహించి త్వరలోనే శాశ్వత పరిష్కారం అందిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను “హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీ”గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.