గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం 25వ డివిజన్ కొత్త కాలనీ మరియు 24వ డివిజన్ శాంతినగర్ ప్రాంతాల్లో మొత్తం రూ.3 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో అనేక అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 25వ డివిజన్ కొత్త కాలనీలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కొత్త కాలనీలోని మొత్తం 12 లైన్ల అభివృద్ధి పనులను ప్రణాళికలో చేర్చగా, ప్రస్తుతం 1 నుంచి 7వ లైన్ల వరకు పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. మిగిలిన పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. 25వ డివిజన్‌లో ఇప్పటికే సుమారు రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తిచేశామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిదంగా జమీందార్ చెరువు పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, వరదల సమయంలో ఇళ్లలోకి నీరు చేరకుండా రూ.30 లక్షల వ్యయంతో బాక్స్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. అమృత్ పథకం కింద మరో రూ.1 కోటి నిధులు మంజూరు చేయించామని, జమీందార్ చెరువును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్, చెరువు బండ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. 24వ డివిజన్ శాంతినగర్‌లో రూ.1.70 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారులు, డ్రైనేజీ, వర్షపు నీటి నిల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా 3వ, 4వ, 5వ లైన్లలో ప్రతి వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం లోతట్టుగా మారిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ పనులు పూర్తయిన తర్వాత వర్షపు నీటి నిల్వలు, మురుగు సమస్యలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. 24వ డివిజన్‌లో ఇప్పటికే సుమారు రూ.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరయ్యాయని, ఇటీవల స్థానిక వాకింగ్ ట్రాక్‌లో కూడా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు, గాలం వెంకటేశ్వర్లు, కదిరి సంజయ్, మానుకొండ శివ ప్రసాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.