BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:07 pm Posted by : BHARATH PRATHINIDHI

కాకినాడ జిల్లా పోలీస్ అధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిహార్సల్స్ నిర్వహించిన జిల్లా పోలీస్ యంత్రాంగం

కాకినాడ బ్యూరో, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డా.మహంతి కిషోర్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూని “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” అంటూ దేశభక్తి నినాదాలతో ర్యాలీగా భానుగుడి సెంటర్ వరకు చేరుకుని అక్కడ ర్యాలీని ముగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ మాట్లాడుతూ వందేమాతరం నినాదం, జాతీయ జెండా ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో బాధ్యతాయుతమైన, ఉత్తమ పౌరులుగా జీవించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్ణయించే గొప్ప వ్యక్తులుగా ఎదిగి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పెద్దలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో బలపడినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డా. మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ ఎస్ శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, ఏ ఆర్ డిఎస్పీ వి జి శ్రీహరి రావు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, సుమారు 1,500 మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.