BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:40 am Posted by : Raghunath Rolla

స్వచ్ఛందంగా నేత్రదానానికి అంగీకరించిన డిఎంహెచ్వో కె. విజయలక్ష్మి

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రజలకు నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. “కంటికి కన్ను – మీ సంకల్పం కావాలి నేత్రదానం, మనందరికీ ఆదర్శం” అనే నినాదంతో ప్రతి ఒక్కరినీ నేత్రదానం వైపు ప్రోత్సహించాలని, నేత్రదానం ఒక మహత్తర సామాజిక సేవగా, ప్రజా ఉద్యమంగా మారేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు వచ్చేలా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి చేయాలని డాక్టర్ కె. విజయలక్ష్మి పిలుపునిచ్చారు.