దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉంది
ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ

కొండపల్లి, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఈ దేశం కోసం.. ధర్మం కోసం.. ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలోనూ వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ సయ్యద్ షా బుకారీ దర్గా ఆవరణలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ… ‘దేశం కోసం ధర్మం కోసం’ అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో లక్ష ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోనే 5 వేల ఇళ్లకు జెండాలను అందజేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింమత పండితులు, పూర్వీకులు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆ త్యాగాల బాటలోనే నేటి తరం కూడా దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సూఫీ మత గురువు అల్తాఫ్ రజా మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన బుకారీ దర్గా ఆవరణలో ‘ఘర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు, పెద్దలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.