BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 6:24 pm Posted by : Raghunath Rolla

వారం రోజుల్లో వీధి దీపాల ఫిర్యాదులను పరిష్కరించాలి

జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ రాబోయే వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వీధి దీపాల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్ విభాగ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, కాల్ సెంటర్ మరియు గ్రీవెన్స్ ద్వారా వీధి దీపాలపై వచ్చిన ఫిర్యాదులను వార్డుల వారీగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏ రోజుకారోజు వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి ఏఈ తమ పరిధిలోని వార్డుల వారీగా వెలగని వీధి దీపాలను క్షేత్రస్థాయిలో సత్వరమే గుర్తించి, సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా వీధి దీపాలు కావాలని ప్రజల నుండి ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు వస్తే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్తంభాలు లేని చోట్ల ఏపిసిపిడిసిఎల్ అధికారులతో సమన్వయం చేసుకొని, నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు రాత్రి వేళల్లో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరమంతటా వీధి దీపాలు నిరంతరం వెలిగేలా చూడటంలో ఇంజినీరింగ్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఈఈ విష్ణు, డిఈఈ శ్రీనివాస్, ఏఈ సాయితేజ పాల్గొన్నారు.