BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 5:37 pm Posted by : BHARATH PRATHINIDHI

లంచం కేసులో సీజీఎస్టీ సూపరింటెండెంట్ అరెస్ట్

విజయవాడలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

విజయవాడ, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లంచం డిమాండ్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్ బనోతు మంగమ్మను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అరెస్ట్ చేసింది. లంచం తీసుకుంటూ ఆమెను సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్న ఫిర్యాదుదారుడి నుంచి పన్ను బకాయిలకు సంబంధించి డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ వ్యవహారాన్ని ముగించేందుకు రూ.1.50 లక్షలు లంచంగా ఇవ్వాలని సీజీఎస్టీ సూపరింటెండెంట్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుపై సీబీఐ అధికారులు ఆగస్టు 10న కేసు నమోదు చేశారు. అనంతరం పక్కా ప్రణాళికతో అదే రోజు ట్రాప్ ఏర్పాటు చేశారు. డిమాండ్ చేసిన లంచంలో భాగంగా రూ.50 వేల నగదును స్వీకరిస్తుండగా బనోతు మంగమ్మను సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ట్రాప్ సందర్భంగా రూ.50 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో సోదాలు
అరెస్టు చేసిన సీజీఎస్టీ సూపరింటెండెంట్‌కు సంబంధించిన విజయవాడలోని నివాసం, ఇతర ప్రాంగణాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అరెస్టు చేసిన నిందితురాలు బనోతు మంగమ్మను ఆగస్టు 11న విజయవాడలోని సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సీబీఐ వెల్లడించింది.