BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 3:36 am Posted by : Raghunath Rolla

విద్యార్థులపై విరిగిన లాఠీ

బీహార్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళన
నిరసనకారులపై జల ఫిరంగుల ప్రయోగం

పట్నా, భారత్ ప్రతినిధి బ్యూరో : బీహార్‌లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్‌సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదనను ప్రతిబింబించింది. సీఎం సామ్రాట్‌ చౌదరి నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేయడమే కాక, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్‌సీ ) ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నందున దానిని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే వచ్చే నెలలో నిర్వహించే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ను ఒకే విడతలో నిర్వహించాలని కోరుతూ మంగళవారం ‘ముఖ్యమంత్రి నివాస ముట్టడి’కి పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ తదితర వామపక్ష సంఘాలతో కలిసి విద్యార్థులు గాంధీ మైదానం నుంచి ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి నివాసం వైపు దూసుకొస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ప్రదర్శన ప్రారంభంలోని జేపీ గోలంబర్‌ వద్ద ఆందోళనకారులపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. పాట్నా హైకోర్టు, ఇన్‌కంట్యాక్స్‌ కార్యాలయం వద్ద బ్యారికేడ్లను ఛేదించిన విద్యార్థులు డాక్‌ బంగ్లావైపు దూసుకుపోయారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ చేయగా, వారిపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. లాఠీచార్జీలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. కాగా, ఆందోళనలో ఒక విద్యార్థిని పోలీస్‌ చెంపదెబ్బ కొట్టిన, రోడ్డు పక్కన ఒక విద్యార్థిని స్పృహతప్పి పడిపోయిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి ఉందని, ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్టు పట్నా సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీస్‌ కార్తికేయ శర్మ తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌) సీబీఐ (ఎం) పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ విద్యార్థి వ్యతిరేక వైఖరి మనకు దేశంలో ఢిల్లీ నుంచి బీహార్‌ వరకు కన్పిస్తున్నదని విమర్శించాయి. బీజేపీ ప్రభుత్వం ఇకనైనా తమ అణచివేత ప్రయత్నాలను మాని వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరాయి.