BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 9:16 pm Posted by : BHARATH PRATHINIDHI

అభివృద్ధిలో రోల్ మోడల్ గా..

రూ.2 కోట్లతో డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 10 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అభివృద్ధికి నూతన అధ్యాయం లిఖిస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. సోమవారం స్థానిక జామియా నగర్, అరుంధతి నగర్ ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రెయిన్, మంచినీటి పైపు లైన్ల నిర్మాణానికి రూ.2 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో డ్రెయిన్లు, రోడ్లు, మంచినీటి పైపు లైన్ల నిర్మాణం వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా జామియా నగర్ లో రూ.1.50 లక్షలతో అవుట్ ఫాల్ డ్రెయిన్ నిర్మించబోతున్నామని చెప్పారు. అరుంధతి నగర్, మంగళదాస్ నగర్, అంబేద్కర్ నగర్, రాజగోపాల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ రూ.50 లక్షలతో మంచి నీటి పైపు లైను ఏర్పాటు చేస్తామన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ప్రధాన ప్రాంతాల్లో సైతం రోడ్లు నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మారుమూల కాలనీలకు మంచినీళ్లు కూడా అందించలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.350 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వంద కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటున్నామని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామని తెలిపారు. తల్లికి వందనం అమలుతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారన్నారు. ఇప్పటికే గూగుల్ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి తరలివచ్చాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలియజేశారు.