వివిధ ప్రదేశాలను తనిఖీ చేసిన జీఎంసీ కమిషనర్

గుంటూరు, 18 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ‘నవ గుంటూరు’ లో భాగంగా నగరంలో పచ్చదనం పెంపు కోసం రోడ్ల వెంబడి, పార్క్ ల్లో నిర్దేశిత లక్ష్యానికి తగిన విధంగా మొక్కలను విరివిగా నాటడం, వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, హార్టికల్చరల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉద్యోగ నగర్, జెకెసి కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మల్లికార్జునపురం, బాలాజీ నగర్, చిన్నేరు కుంట, హెడ్ వాటర్ వర్క్స్ ని పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ‘నవ గుంటూరు’లో భాగంగా నగరంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రధానంగా రోడ్లకి ఇరువైపులా, డివైడర్లతో పాటు నూతన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల్లో మొక్కలు కూడా ఉండేలా చూడాలని ఎస్ఈని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెంలోని పార్క్ ని పరిశీలించి, పెండింగ్ పనులను వెంటనే పూర్తీ చేయాలని, పార్క్ లో గ్రీనరీ లాన్, మొక్కలు నాటాలని ఏడీహెచ్, డిఈఈని ఆదేశించి, పార్క్ నిర్వహణకు వాకర్స్ కమిటీ ముందుకు రావాలని కోరారు. రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలకు సపోర్ట్ గా కర్రలను కట్టాలని, ఎప్పటికప్పుడు నీటిని అందించాలని ఏడీహెచ్ ని ఆదేశించారు. చిన్నేరుకుంటని పరిశీలించి, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ ని పరిశీలించి, గుంటూరు నగరానికి ఉండవల్లి దగ్గర ప్రకాశం బ్యారేజి నుండి పైప్ లైన్ ద్వారా నేరుగా నీటిని పంపింగ్ చేసి, తక్కెళ్లపాడు ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఫిల్టర్ చేసి, క్లోరింగ్, ఆలం తగు మోతాదులో కలిపి సరఫరా చేస్తామని, గుంటూరు చానల్ నుండి నీటిని తీసుకోవడంలేదన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ లో ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను తనిఖీ చేసి, నిర్దేశిత రిజిస్టర్ లో నమోదు చేయాలని, ప్లాంట్ పరిసరాల్లోకి ఇతరులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. అనంతరం ఇటీవల బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణలో ప్రభావితమయ్యే చెట్లను ట్రాన్స్ లొకేషన్ లో భాగంగా హెడ్ వాటర్ వర్క్స్ ప్లాంట్ పరిసరాల్లో నాటిన చెట్లను పరిశీలించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ శ్రీనివాస్, వెంకటరమణ, ఏడీహెచ్ శాంతి, ఏసిపీ జకిరా, ఎస్ఎస్ లు సోమశేఖర్, అయూబ్ ఖాన్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.