BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:22 pm Posted by : BHARATH PRATHINIDHI

కాకాని దేవాలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ

దొంగలను వెంటనే అరెస్టు చేయాలి: అంబటి మురళీకృష్ణ

గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పెదకాకాని శ్రీగంగా భ్రమరాంబ సమేత నుల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆదిశక్తి అమ్మవారి మంగళసూత్రం అపహరణ ఘటనపై పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పవిత్ర శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనంతరం అమ్మవారి మంగళసూత్రం కనిపించకుండా పోయిందని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యే వరకు కూడా ఘటనపై కేసు నమోదు చేయకపోవడం దేవాలయ పాలకమండలి, పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. భక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో కేసు నమోదు చేయకపోవడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, దేవాలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు.

పెదకాకాని లోని గంగా భ్రమరాంబికా దేవి తాళి దొంగతనం 14 వ తేదీన జరిగింది.ఆ విషయం పై విచారణ చేయాలని కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసాము.21 వ తేదీన మేము ఫిర్యాదు చేసేవరకు దేవాలయ అధికారులు, కమిటీ సభ్యులు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. కాకాని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.అమ్మవారి మంగళ సూత్రం దొంగతనం జరిగితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసారు.22 వ తేదీవరకు దేవాదాయ శాఖ,ఆలయ సిబ్బంది నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అమ్మవారి మంగళ సూత్రం దొంగతనం విషయం లో రాజకీయాలు చేయటం సరైన విధానం కాదు. అమ్మవారి మంగళ సూత్రం దొంగతనం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే. భగవంతుని సేవలో ఉండే పూజారులను అర్థరాత్రి వరకు స్టేషన్ లో ఉంచటం సరికాదు. పూజారులు తలా కొంచెం వేసుకుని తాళిబొట్టు చేయించమని పంచాయతీ చేయటం దారుణం.అమ్మవారి తో చెలగాటం ఆడటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే.అమ్మవారి మంగళ సూత్రం తయారు చేయించి ఇచ్చేందుకు నేను సిద్దంగా ఉన్నాను.

స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఈ ఘటనపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఘటన జరిగి పది రోజులు గడిచినా నిందితులను గుర్తించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మంగళసూత్రం అపహరణకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, దేవాలయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు.