హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వీఎంసీ తనిఖీలు
విజయవాడ, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ హెచ్చరించారు. నగరంలోని 39, 40, 41, 42వ శానిటరీ డివిజన్ల పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో శానిటరీ సూపర్‌వైజర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుమల రెస్టారెంట్, బాలాజీ హోటల్, పాండు హోటల్, గుప్తా టిఫిన్ సెంటర్ తదితర ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార వ్యర్థాల నిర్వహణ, డస్ట్‌బిన్ల ఏర్పాటు, పరిసరాల పారిశుధ్యాన్ని పరిశీలించారు. తనిఖీల్లో కొన్ని హోటళ్లలో ఫుడ్ వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, డస్ట్‌బిన్లు లేకపోవడం, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వంటి లోపాలను గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రూ.4,000 జరిమానా విధించారు. లోపాలు గుర్తించిన హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లోగా లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లోపాలను సరిచేయకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు నిబంధనల ప్రకారం మరిన్ని జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్ ఎస్.వి.ఎస్. శ్రీధర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆదినారాయణ, వి. శ్రీనివాస్, జె. దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.