BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:02 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరు జిఎంసిలో ఏసీబీ దాడిలు

 

156 పనుల్లో అవకతవకలు గుర్తింపు

గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో పది మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొని రికార్డులను పరిశీలించారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో నగరపాలక సంస్థలోని ఇతర విభాగాల అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. 2017 నుంచి 2025 వరకు జీఎంసీ పరిధిలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైప్లాన్ల నిర్మాణ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలియజేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది అధికారులు వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. మొత్తం 156 పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, పైపులైన్లు, డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగినట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్‌ విభాగంలో టెండర్ల పర్సంటేజీలను మార్చి అవకతవకలకు పాల్పడిన అంశంపై విచారణ కొనసాగుతోందన్నారు. ఏసీబీ తనిఖీలు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలిపారు. పల్నాడు, గుంటూరు జిల్లాలు ఏసీబీ పరిధిలో ఉన్నాయని, ఎక్కడైనా అవినీతి జరిగినట్లు సమాచారం ఉంటే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.