BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:36 pm Posted by : BHARATH PRATHINIDHI

మొండిగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యగా పేరుకుపోయి ఉన్న మొండిగేట్ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సమీకరించిన రూ. 6.23 కోట్ల రైల్వే శాఖ నిధులతో ఆధునికీకరించబోతున్న పనులకు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు నగరం నుంచి విడుదలవుతున్న డ్రైనేజ్ నీరు మూడు ప్రాంతాల నుంచి పీకల వాగు, మొండిగేట్ ప్రాంతాల నుంచి మురుగునీరు బయటకు సరఫరా అవుతుందన్నారు. ఈ గేటు ద్వారా సగటున 30 వేల లీటర్ల డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్తుంది. కానీ వర్షాలు అధికంగా పడిన సమయంలో వర్షపు నీరు, మురుగునీరు కలిసి పొంగి ఇళ్లల్లోకి కూడా వెళ్తున్నాయి. స్థానిక ప్రజల సమస్యలను నేను, నసిర్ దగ్గరుండి చూశాము. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రస్తుతమున్న 30వేల లీటర్ల మురుగు పారుదలను 50 వేల లీటర్ల పారుదలకు అనుగుణంగా ఆధునికరిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని గుర్తించాము. అవుట్ పుట్ పెంచితేనే స్థానిక సమస్య ప్రజల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదించాము. ఆ ప్రతిపాదనలకు గాను సుమారు రూ. 7-8 కోట్ల అంచనాలు అవుతాయని భావించాము. ఈ నిధులను సమకూర్చేందుకు అధికారులతో సంప్రదించి, రైల్వే వారి నుంచి విడుదల చేసేందుకు సన్నహాలు చేశాము. రైల్వే శాఖ నుంచి కూడా సుముఖత వ్యక్తం కావడంతో నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నాము. 40-50 సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడితే చుట్టుపక్కల డ్రైనేజీ ముంపుకు గురై సమస్యలు ఎదుర్కొంటున్న పంటపొలాల యజమానులకు కూడా పరిష్కారం దొరికినట్టే. రాజీవ్ గృహకల్ప, గొట్టాల రోడ్డు, వెంకటరామా థియేటర్, జియాద్దీన్ నగర్ ఈ నాలుగు ప్రాంతాల్లో, ఒక్కో ప్రాంతము వద్ద రూ. 2 కోట్లతో పనులను చేయిస్తున్నామని తెలియజేశారు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పాత గుంటూరు ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ మొండిగేట్ ఇబ్బందిని పరిష్కరిస్తున్నాము. గుంటూరు నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ మురుగునీరు మొత్తం మొండిగేట్ వద్దకు వచ్చి పారుదల సజావుగా ముందుకు సాగక, పొంగి బయటకు పొర్లుతోందన్న విషయం అందరికి తెలిసిందే. స్థానిక అధికారులతో చర్చించగా సమస్యకు కోట్లాది రూపాయల వ్యయంతో ముడిపడి ఉందని అర్థమైన తర్వాత సమస్యను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ పాత గుంటూరు ప్రాంతంలో నివసించే 50 వేల కుటుంబాలకు పైగా పరిష్కారంగా మొండిగేట్ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టాము. సబ్ స్టేషన్ ఏర్పాటు, నందివెలుగు ఆర్ఓబి ఇప్పుడు మొండిగేట్ ఆధునికీకరణ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చాము. గత వైసిపి పాలనలో తట్ట మట్టి కూడా ఎత్తని పరిస్థితి నుంచి నేడు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని సహకారంతో రూ. 48 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాము. ప్రతీ ఒక్కరి సమస్యలు మా సమస్యగా నేను పెమ్మసానితో కలిసి పనిచేస్తున్నామని తెలియజేశారు. రైల్వే అదనపు డిఆర్ఎం రమేష్ మాట్లాడుతూ,రైల్వే 1.2 నుంచి 1.3 మీటర్ల పొడవునా ఆధునికీకరించి అదనంగా మరో 25 క్యూసెక్కులకు పైగా డ్రైనేజీ నీటిని విడుదల చేసే విధంగా నిర్మిస్తున్నాము. నిర్మాణానికి సంబంధించి నిధులు ఈ సంవత్సరమే మంజూరయ్యాయి. వర్షాకాలం పూర్తయిన తర్వాత మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. అనవసరమైన వ్యర్ధాలు ఈ డ్రైనేజీలో కలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, మాజీ కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, మీరావళి, చిష్టి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.