BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:13 pm Posted by : BHARATH PRATHINIDHI

ఒంగోలు వైసీపీలో ముదురుతున్న విభేదాలు..!

ఒంగోలు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైసీపీలో విభేదాలు, వివాదాలు ముదిరిపోయాయి. ఎన్నడూ లేని వి ధంగా ఆ పార్టీ నాయకులు రోడ్డుకెక్కుతున్నారు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారన్న కార ణంతో ఇద్దరు మహిళలపై వేటు వేయగా అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తాజాగా ఒంగోలులో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడి తప్పుడు విధానాల వల్లనే పార్టీ మరింత భ్రష్టుపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. గతనెలలో ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్‌ జయంతి వేడుకల సందర్భంగా ఇరువురు మహిళల మధ్య చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఆ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒకరికి మద్దతుగా పార్టీలో కీలకంగా వ్యవహరించే నేత మద్దతుదారులు వైసీపీ ఎస్టీసెల్‌ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై దాడి చేశారు. ఈ సమయంలో పార్టీ నాయకులు ఉన్నా కనీసం పట్టించుకోలేదు. దీంతో పేరం ప్రసన్నకు మద్దతుగా ఆ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు నిలవడంతోపాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడే బైఠాయించారు. ఈ విషయం రచ్చకావడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేసింది. దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఈ ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చే సి నివేదికను ఇవ్వాలని సూచించారు. ఇది జరిగిన మరుసటిరోజే పేరం ప్రసన్న కుమారుడు తన తల్లిపై దాడి చేసిన గోనెల శివపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసుస్టేషన్‌కు పంచాయితీ చేరింది.

ఆత్మహత్యాయత్నంతో కలకలం.. తనను మానసికంగా దెబ్బతీయడంతోపాటు పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ కూడా బాధితురాలిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు నియమించిన త్రిసభ్య కమిటీ విచారించి పార్టీకి నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను ఏకపక్షంగా ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నాయకుడు చెప్పిన మాటలు విని తమను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీసీ నేత బొట్ల కూడా సస్పెన్షన్‌.. ప్రస్తుతం వైసీపీ వలంటీర్ల విభాగం రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరి, ఒంగోలు నగర కార్యదర్శి గోనెల శివ, ఒంగోలు నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షురాలు పేరం ప్రసన్న, విద్యార్థి విభాగం సిటీ అధ్యక్షుడు మెట్టెల వెంకటేష్‌ (వెంకు), ఒంగోలు నగర ఆరవ డివిజన్‌ అధ్యక్షుడు కటారి సాయి, బీసీ సెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.