BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 2:54 am Posted by : BHARATH PRATHINIDHI

మధ్యవర్తిత్వంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం

పెదకూరపాడులో ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం

పెదకూరపాడు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వి.విజయకుమార్ రెడ్డి సూచనలతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో గురువారం మధ్యవర్తిత్వం (Mediation), రాజీమార్గం మరియు ఉచిత న్యాయ సహాయం అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ, సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివాదాలు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ వివాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు వంటి అనేక అంశాలను మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సత్తెనపల్లి కోర్టు పరిధిలోని కక్షిదారులు కోర్టు పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డులో ఉన్న కోర్టును సంప్రదించి, మధ్యవర్తిత్వ సేవలను వినియోగించుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని, ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ అట్లూరి జ్యోతి పాల్గొని మధ్యవర్తిత్వ విధానం, ఉచిత న్యాయ సేవలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.